Posts

Showing posts from August, 2021

కరోనా రక్కసి

 అడుగు తీసి  అడుగెయ్యాలంటే అదేదో బూచి ఆపత్కాలంలో అందించే ఆపన్నహస్తానికీ అదే అదృశ్య నిషి మనిషి మనిషికి  ఇప్పుడు కొత్త కొత్త  వైద్య సరిహద్దులు  ప్రకృతిని  పరిహసించిన ఫలితం  మనిషిని  వెంటాడుతున్న ఆధునిక రోగం కాలగమనంలో  జీవజాలాన్ని ముంచెత్తనున్న విషవాహిని

భయం

 చీకటి దుప్పటి  కప్పుకున్న రాత్రి  నిశ్శబ్దాన్ని శ్వాసిస్తున్న నగరం నాగరికత  మూల్గుతూ ప్రవహిస్తూ మురుగుకొంగు మాటున మూసీనది ఒక ముసలికుక్క రోదన గుడ్లగూబ అరుపు హాస్పిటల్ వైపు పరుగెత్తెే అంబులెన్స్ అప్పుడే బయల్దేరిన గస్తీపోలీసు వాహనం భయం భయం భయం అలికిడి లేకుంటే అంతటా ఆవహించేది భయమే!

పేదల బతుకులు

నడుస్తున్న సమాజం నడిబొడ్డున పరిహాసం పేదరికపు బతుకులపై ప్రేమవర్షం కుండపోత గతించిన రోజుల్లోని గాయాలకు లేపనం అందనిద్రాక్షగుత్తుల ఆకర్షక పథకాల పరంపర చేపకోసం వేసే కమ్మని ఎర పేదలబతుకులు ఇంకా ప్రయోగశాలలే!  

విద్య కకావికలం

చదువుల ఒడి బడి ఆగం ఆగం రేపటి పౌరుల దశ దిశ వెతుక్కుంటోంది కరోనావిలయంతో విలవిలలాడుతోంది బాల్యం అదృశ్య పాఠాల అయోమయ తతంగం పేదబాలలను వెక్కిరిస్తుంటే విధి నిర్వహణలో వెలవెలబోతున్న పంతులు చదువుల చెట్టు మళ్లీ  చిగురించేదెప్పుడో! పిల్లలు పిట్టలై  ఆ తరుశాఖల్లో తిరుగాడేదెప్పుడో!

*అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్ళీ వినాలి* (స్మృతిగీతం)

అమ్మంటే ప్రాణం   నరాల్లో వహించే జీవం  ఊహల మేఘాలను చూపిస్తూ బతుకు బువ్వను తినిపించిన అమృత హస్తం కాలపు ప్రవాహంలో కనిపించని అభయ హస్తం   అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి *    *   *   * నీ రూపం నా గుండె గుడిలో   మూలవిరాట్టు   నీ జ్ఞాపకం నా హృదయ లయలో జీవనాదం నీ దీవెన నా జీవనయానంలో గమించే చేతనచక్రం  అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్ళీ వినాలి  *   *    *    * కష్టాల కడలి ముంచెత్తిన ప్పుడల్లా   నీవిచ్చి వెళ్లిన ఆత్మస్థైర్యం తీరమై అక్కున చేర్చుకుంటుంది విషాదం విషమై బుసకొట్టినప్పుడల్లా నీవందించిన ఆనందం అమృతమై వర్షిస్తుంది దైన్యం చీకటిలా నన్నలుముకున్న ప్పుడల్లా  ధైర్యమై నీ రూపం వెన్నుతడుతుంది   అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి  *   *   *   * నా పంచేంద్రియల జ్ఞానం నీవే వాక్కుకు ఆధారం నీవే   నవనాడుల్లో చైతన్యస్రవంతి వి నీవే  పలికే ప్రతి భావానికి అక్షరమైన ఆధారం నీవే నా మునివేళ్ళు అక్షరాలు దిద్దుతున్నప్పుడు ...
 ఎక్కడ మొదలై ఏ మూలన ఆగేనో చలనం జ్వలనంలా! మదిగుడిలో  ఒదిగిన మూలవిరాట్టు నేత్రంలా! మథనం అంచున లభించే అమృతం వెనుక జరిగిన శ్రమసంగతులెన్ని! ఇంకెన్నాళ్ళీ రహస్య యుద్ధం మానవకత మరుగైతే మనిషికి స్థానం ఎక్కడ! కరుణ వాత్సల్యం  కురిస్తేనే జనకళ్యాణం!

అమ్మ

 అమ్మంటే ప్రాణం నరాల్లో వహించే జీవం ఊహలమేఘాలను చూపిస్తూ బతుకుబువ్వను తినిపించిన  అమృతహస్తం కాలపుప్రవాహంలో కనిపించని అభయహస్తం!